కాంట్రాక్టు హెల్త్ అసిస్టెంట్లను కొనసాగించాలి
· యునైటెడ్ మెడికల్
అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్
సుప్రీం కోర్టు ఉత్తర్వులను అమలుచేస్తూనే కాంట్రాక్టు హెల్త్
అసిస్టెంట్లందరినీ ఖాళీల్లో యథావిధిగా కొనసాగించాలని యునైటెడ్ మెడికల్ అండ్
హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు ప్రభుత్వాన్ని కోరారు. సంఘం రాష్ట్ర
అధ్యక్షులు సిహెచ్ రోజారాణి, ఉపాధ్యక్షులు భూపాల్, ప్రధాన కార్యదర్శి బలరాం
సోమవారం వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి కె రత్నకిషోర్‌ను
కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. వైద్య ఆరోగ్య శాఖలో మేల్ అసిస్టెంట్ల పోస్టులను
రాష్ట్ర ప్రభుత్వం జీవో 459 ప్రకారం మంజూరు చేసి, హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఇంటర్
క్వాలిఫికేషన్‌తో 2,324 పోస్టులకు నియామకాలు చేపట్టింది. 2006లో సుప్రీం కోర్టు ఉత్తర్వుల
మేరకు ఎస్‌ఎస్‌సి క్వాలిఫికేషన్‌తో అదనంగా దాదాపు 17 వందలకుపైగా నియమించారు.
ప్రస్తుతం సుప్రీం కోర్టు, హైకోర్టు తుది ఉత్తర్వులను అమలు చేయాలని తీర్పు
చెప్పింది. దీని ప్రకారం ఎస్‌ఎస్‌సి అర్హతతో ఉన్న మెరిట్ లిస్టు ప్రకారం
జిల్లాలవారీగా 2,324 పోస్టులకు మాత్రమే నియమించి మిగతా వారిని తొలగించడానికి
ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోందని సంఘం నేతలు తెలిపారు. ఈ చర్య వల్ల 1,800మందికి
పైగా ఉద్యోగులు తమ ఉద్యోగ భద్రతపై ఆందోళన చెందుతున్నారని వారు పేర్కొన్నారు.
ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖలో 5,444 మేల్ హెల్త్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ
చేయనున్నారని, ఈ ఖాళీ పోస్టులను ఇంతకాలం పనిచేసిన ఉద్యోగులతోనే భర్తీ చేయాలని సంఘం
నేతలు ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. ప్రస్తుతం పనిచేస్తున్న దాదాపు 3,686 మందిని
ఖాళీ పోస్టుల్లో రెగ్యులర్ చేయాలని, 2010 పిఆర్‌సి ప్రకారం వేతనాలు పెంచాలని, బకాయిలు
చెల్లించాలని కోరారు. ఈ సందర్భంగా ముఖ్యకార్యదర్శి మాట్లాడుతూ హెల్త్ అసిస్టెంట్ల
విషయమై సుప్రీంకోర్టు తీర్పుపై ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదని, ఉద్యోగులు
దుష్ప్రచారాలు నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తిచేశారు.
No comments:
Post a Comment