11/19/2011 3:08:52 AM
ఎంహెచ్‌ఏల తొలగింపు?
- రంగం సిద్ధం చేసిన ప్రభుత్వం
- రోడ్డున పడనున్న 1781 మంది
- జాబితా పంపించాలని డీఎంహెచ్‌ఓలకు ఆదేశం
- ఆందోళన బాటలో కాంట్రాక్టు ఉద్యోగులు
నల్లగొండ, నవంబర్ 18(టీ న్యూస్): వైద్య, ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న 1781 మంది మల్టిపర్పస్ హెల్త్ అసిస్టెంట్లను(ఎంహెచ్‌ఏ) తొలగించేందుకు కిరణ్ సర్కార్ రంగం సిద్ధం చేసింది. వీరంతా తొమ్మిదేళ్లుగా కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్నారు. సర్కార్ కొలువులు లేకపోయినా కాంట్రాక్టు ఉద్యోగాలతోనే సంతృప్తి చెందుతున్న వారిని తొలగించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు. మరోవైపు వయోపరిమితి మించిపోవడంతో ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులయ్యామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ముందుచూపు లేని సర్కారు
2002లో రాష్ట్ర ప్రభుత్వం వైద్య, ఆరోగ్య శాఖలో 2324 ఎంహెచ్‌ఏ (మేల్) పోస్టులు కాంట్రాక్ట్ పద్ధతిపై భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. అభ్యర్థులకు అదే ఏడాది ఆగస్టు 12న రాత పరీక్ష నిర్వహించింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు పదవ తరగతి పాసై, ఒక సంవత్సరం ప్రజారోగ్యంపై డిప్లొమా చేసి ఉండాలనిఅర్హతగా పేర్కొన్నారు. ఈ ఎంపిక పరీక్ష ముగిసిన అనంతరం ప్రభుత్వ ఇన్‌స్టిట్యూట్‌లలో చదివి, ఇంటర్మీడియట్ తర్వాత డిప్లొమా చేసిన అభ్యర్థులు కొందరు తమకే ప్రాధాన్యత ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను విచారించిన కోర్టు వారికే ప్రాధాన్యత ఇవ్వాలని 2003 మేలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వుల మేరకు 2324 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. 2003 సెప్టెంబర్‌లో హైకోర్టు తుది తీర్పునిస్తూ నోటిఫికేషన్ ప్రకారమే ఉద్యోగాలను భర్తీ చేసుకోవాలని పేర్కొంది. దీంతో ప్రభుత్వ ఇన్‌స్టిట్యూట్‌లలో చదివి, ఇంటర్మీడియట్ తర్వాత డిప్లొమా చేసిన కాంట్రాక్ట్ ఉద్యోగులు తమను తొలగించకుండా సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు.
2006లో సుప్రీం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ ఇప్పటికే భర్తీ చేసిన వారిని తొలగించకుండా వైద్య, ఆరోగ్య శాఖలో ఎంహెచ్‌ఏ ఖాళీలలో భర్తీ చేయాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం అప్పటి వరకు ఖాళీగా ఉన్న ఎంహెచ్‌ఏ పోస్టులలో 1781 మందిని జీవో నెం.1234 ప్రకారం భర్తీ చేసింది. 2011 ఆగస్టులో సుప్రీం తుది ఆదేశాలిస్తూ హైకోర్టు తీర్పును సమర్థించింది. రాష్ట్ర ప్రభుత్వం అదనంగా భర్తీ చేసిన 1781 పోస్టులను తొలగించి, నోటిఫికేషన్ ప్రకారం 2324 పోస్టులను మాత్రమే కొనసాగించాలని నిర్ణయించింది. 2006లో అదనంగా భర్తీ చేసిన పోస్టులన్నింటినీ తొలగించేందుకు జాబితాను తయారు చేయాలని జిల్లా అధికారులకు వైద్య, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో కాంట్రాక్ట్ పద్ధతిపై పనిచేస్తున్న ఎంహెచ్‌ఏలు ఈ ఆదేశాలతో ఆందోళన బాటపట్టారు.
No comments:
Post a Comment